Sunday, November 4, 2018

Happy folding!మా నాన్నగారు--- మా బొమ్మల కొలువు(1)posted

మా మొట్టమొదటి బొమ్మలకొలువు నెల్లూరులో బాగా చిన్నతనంలోనే పెట్టించారు ఒక సందుగా పెట్టి మీద
మంచి చీర కప్పి 12 ప్లాస్టిక్ బొమ్మలు యు ఆకారంలో అమర్చి మా మొదటి బొమ్మలకొలువు జరిగింది ఆ ప్లాస్టిక్ బొమ్మలు కూడా కింద చిన్న నల్లటి పెట్టి లాంటిది ఉండేది. దాని మీద బొమ్మ నటరాజు, వెంకటేశ్వర స్వామి, బిడ్డకి పాలిస్తున్న తల్లి, అందంగా నీళ్లు ఒలకబోస్తున్న కన్నె పిల్ల, చేత వెన్న ముద్ద తో కృష్ణుడు , శివపార్వతులు... ఆ బొమ్మలు దంతంతో చేసినట్లుగా ఉండేవి.... వాటి నీ ఎంచుకోవడంలో నాన్నగారి కళాత్మక దృష్టి తెలిసేది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం బొమ్మలకొలువు బొమ్మలు పెరుగుతూ ఉండేవి
   
కొండపల్లి బొమ్మ ఒకటి స్టాండ్ మీద నిలబడి తాకగానే వయ్యారంగా ఊగుతూ డాన్స్ చేస్తూ ఉండేది.. అప్పట్లో ఈ బొమ్మ చాలామంది ఇళ్లలోనే ఉండేది. కొయ్య బొమ్మలు  రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు.. లేపాక్షి అంబారి ఏనుగు.. లక్క ఏనుగులు మీద గాజు అద్దాలు అంటించి చాలా అందంగా ఉండేవి.. ఎగ్జిబిషన్లలో మేము ఎంత గోల పెట్టి ఏడ్చినా నాన్న సెలక్షన్ చాలా క్లాస్ గా ఉండేది ఆ బొమ్మలు తెచ్చి మేము షోకేస్ లో పెడితే అందరూ అడిగే వారు ఎక్కడ కొన్నారు అని..
   
           విశాఖ ఎగ్జిబిషన్లో నాన్న కొన్న  ఒక బెంగాలీ తాత మామ్మగారు బొమ్మలు చాలా అందంగా ఉండేవి మెడకి చిన్న స్ప్రింగ్ ఉండి ఊగుతూ తాతగారి చేతిలో గొడుగు భగవద్గీత మామ్మగారి చేతిలో హ్యాండ్ బ్యాగ్ చక్కటి కొప్పు తో మంచి జరీ అంచు చీర తో ఆ రెండు బొమ్మలు చాలా ముద్దుగా ఉండేవి.. ఇవి నాన్న తెచ్చినప్పుడు మేము నాన్నగారు అమ్మ మీరు ముసలి అయితే ఇలా ఉండాలి అంటే అమ్మ ఆయన కూడా ముసిముసినవ్వులు.. ఆ బొమ్మలు ఎప్పుడు తీసినా నవ్వుకునే వాళ్ళం

         బొమ్మల కొలువు పెట్టినప్పుడల్లా ఏవో కొన్ని బొమ్మలు విరగడం వాటిని రిపేరు చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది మాసిన బొమ్మలకు రంగులు వేయడం. ఒకసారి మేము కొన్న బ్యాండ్ మేళం మేళగాళ్లు అందరి కాళ్ళు చేతులు విరిగిపోయేయి ఆ బొమ్మలకి విరిగిన చోట తెల్ల కాగితాలు అంటించి హాస్పిటల్ లో పేషెంట్ లాగా తయారు చేసి ఒక మిలటరీ హాస్పిటల్ లాగా పెట్టాము 

      అలాగే అక్క దూదితో కోళ్లు తయారు చేసేది వాటితో కోళ్ల ఫారం బేసిన్ లో నీళ్ళు పోసి కడిగిన కోడిగుడ్డు గుల్లలు ఐడ్రాపర్ లు ఉపయోగించే చేసిన బాతులు వేసేవాళ్ళం..
        
            మరిచేపోయాను అప్పట్లో బినాకా టూత్ పేస్ట్ డబ్బాలో చిన్న చిన్న జంతువుల బొమ్మలు ఇచ్చేవాళ్ళు ఆ బొమ్మల కోసం ఆ పేస్టు కొనిపించి బొమ్మలన్నీ దాచే వాళ్ళం వాటన్నిటినీ పెట్టి ఒక జంతుప్రదర్శనశాల తయారు చేసే వాళ్ళం. పాయింట్ అనే ఒక రకం సర్ఫ్ కూడా వచ్చేది దాని మీద ఒక చిన్న పాప బొమ్మ లోపల బొమ్మకు తగిలించే కాగితపు గౌనులు ఉండేవి. అవి కూడా నాన్న ఎంతో శ్రద్ధగా మా అందరి మధ్యలో కూర్చుని తయారుచేసి సంబరపడేవారు ఆ పేస్టు సర్ఫ్ కంపెనీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి
            
              అదేమిటో బొమ్మలకొలువు పెట్టగానే రకరకాల ఐడియాలు బుర్రలో పుట్టుకొచ్చేవి.. చీపురు కట్ట వెనుక ఉండే ఇనుప గొట్టాన్ని చెక్క ముక్కకి దిగేసి పురికొస చుట్టి దానికి నల్ల రంగు వేసి ఆ గొట్టంలో కాగితంతో తాటియాకులు కత్తిరించి వేసి నలుపు గోధుమ రంగు పూసలు ని తాటి కాయలు గా వైరు చుట్టి దానికి తగిలించేవాళ్ళం.. అలాగే పూతిక చీపురు పుల్లలు అంటించి ఇళ్ళు.. 
          
            ఇంటర్నెట్ లేని రోజుల్లోనే అగ్గిపెట్టెలతో అట్టపెట్టెలతో సోఫాలు కుర్చీలు ఇళ్ళు అనేకం తయారు చేసే వాళ్ళం... నలుగురు పిల్లలం ఈ పనిలో ఎంతో బిజీ గా ఉండే వాళ్ళం... ఫెవికాల్.... జిగురు లాంటివి తెలియనే తెలియవు మైదాపిండి ఉడికించి అంటించడమే.. అమ్మని నిమిష నిమిషానికి పిండి ఉడికించి ఇమ్మని పీక్కుతినే వాళ్ళం
     
    దసరా సెలవులు ఇవ్వక ముందు నుంచి కొలువులో ఏమేమి పెట్టాలి ఎక్కడ ఎక్కడ పెట్టాలి అని వాదనలు ప్రతిపాదనలు జోరుగా జరిగేది మెట్లు కాకుండా పొలాలు... పల్లెలు గుళ్లు... అన్నీ ప్లాన్ చేసుకునే వాళ్ళం....ఇలాంటి వాటిలో పెట్టడానికి ఎక్కువగా తీర్థాల్లో కొన్న కార్లు సైకిల్ బస్సులు ఇలాంటివి ఎక్కువ వాడేవాళ్ళం... కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళ దగ్గర మట్టి అడిగి తెచ్చి ఒకచోటంతా టార్పాలిన్ పరిచి దానిమీద మట్టి పోసి.. ఒక చిన్న పల్లెటూరు నగర వాతావరణం సృష్టించేవాళ్ళం.. పొలాల మధ్య ఇళ్ల మధ్యన రోడ్లు కోసం ఇటుకలు బొగ్గులు మెత్తగా నూరి ఎర్ర మట్టి రోడ్లు తారు రోడ్లు వేసేవాళ్ళు...

      అమ్మ ఒక్కొక్కసారి తొమ్మిది రోజులు ఒక్కొక్కసారి మూడు రోజులు పేరంటం పెట్టేది మేము ఎక్కువ కష్టపడి పెట్టినప్పుడు తొమ్మిది రోజులు ఉంచే వాళ్ళం... అమ్మ ఆ రోజుల్లో పిల్లలకి పెట్టడానికి అటుకులు బెల్లం కొబ్బరి ఉండలు గాని రవ్వ లడ్డు గాని శనగల గుగ్గిళ్ళు పులిహార పరవాన్నం పిండి పులిహార శనగపప్పు కొబ్బరి పోపు వేసి లేదా పెసరపప్పు వేసి  రకరకాలుగా చక్కగా చేసేది. ఇవి పెట్టడానికి బాదమాకు లు అరిటాకులు ఎలాగో ఒక లాగ సేకరించే వాళ్ళం
(రేపు మరి కొంచెం బొమ్మలకొలువు విశేషాలు చెప్తాను నేను ఇంకా హుషారుగా రాయాలంటే మీ కామెంట్ల లడ్డూలు చాలా అవసరం.. మరి ఉంటాను)
మీ తల్లాప్రగడ శ్రీదేవి